విజయ డెయిరీ నెయ్యి క్వాలిటీపై టెస్ట్‌‌‌‌లు చేస్తున్నం..కాఫ్, ఎన్డీడీబీ రిపోర్ట్‌‌‌‌ను కూడా పరిశీలిస్తున్నం

విజయ డెయిరీ నెయ్యి క్వాలిటీపై టెస్ట్‌‌‌‌లు చేస్తున్నం..కాఫ్, ఎన్డీడీబీ రిపోర్ట్‌‌‌‌ను కూడా పరిశీలిస్తున్నం
  • గుత్తా అమిత్‌‌‌‌ ట్వీట్‌‌‌‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్‌‌‌‌ ఆన్సర్

హైదరాబాద్, వెలుగు : విజయ డెయిరీ పేరుతో గుజరాత్‌‌‌‌ కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారంటూ టీడీడీసీఎఫ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి చేసిన ట్వీట్‌‌‌‌కు బుధవారం ఏపీ మంత్రి నారా లోకేశ్‌‌‌‌ స్పందించారు. నెయ్యిపై ఏపీ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ పరీక్షలు నిర్వహిస్తోందని ఎక్స్‌‌‌‌ (ట్విట్టర్‌‌‌‌)లో వెల్లడించారు. ‘మీ ఆందోళనను గమనించి సమీక్షిస్తున్నం. 

ఇప్పుడు మార్కెట్‌‌‌‌లో ర్యాండమ్‌‌‌‌గా శాంపిల్స్‌‌‌‌ సేకరిస్తున్నాం. వన్‌‌‌‌ నేషన్‌‌‌‌, వన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ అనేది మోదీ నినాదం, పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించవచ్చు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యం ఏపీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలు’ అని నారా లోకేశ్‌‌‌‌ రిప్లై ఇచ్చారు. 

మేఘన ఫుడ్స్‌‌‌‌ అనే సంస్థకు విజయ డెయిరీ ఫ్రాంచైజీ ఇచ్చారని గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఆ సంస్థ గుజరాత్‌‌‌‌లోని కన్హాన్ డెయిరీ నుంచి నెయ్యిని సేకరించి తెలంగాణలో అమ్ముతోందన్నారు. ఈ  నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్‌‌‌‌ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ (ఎన్డీడీబీ ) నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ విజయ డెయిరీపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్లు తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయన్నారు. 

దీనికి బదులుగా ఏపీడీడీసీఎఫ్‌‌‌‌కు లీటర్ పాల అమ్మకాలపై రూపాయి మాత్రమే వస్తుందని.. రైతులకు, కో-ఆపరేటివ్స్‌‌‌‌కు పెద్దగా లాభం లేదన్నారు. దీని వల్ల తెలంగాణ, ఏపీ పాడి రైతులకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

డెయిరీ ఫెడరేషన్‌‌‌‌ నిబంధనల ప్రకారం ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై ఏపీ డెయిరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని గుత్తా అమిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.